కరోనాకు సొంత వైద్యం ప్రమాదకరం అంటున్న వైద్యులు

  • మందులు వాడినా పాజిటివ్ వస్తోందంటున్న ప్రజలు
  • అది సహజమేనన్న వైద్యులు!
  • 15 రోజుల తర్వాత మందులు అనవసరం అని వెల్లడి
  • పదే పదే టెస్టులు వద్దని సూచన
ఇటీవల కాలంలో కరోనాకు ఈ మందులు వాడితే సరిపోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని జాబితాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏ మాత్ర వాడాలి, ఎన్నిరోజులు వాడాలి అనే విషయాలను స్వదస్తూరీతో ఓ పేపర్ పై నీట్ గా  రాసిన వైనం ఆయా పోస్టుల్లో చూడొచ్చు. వీటిని అనుసరించేవారు కొందరైతే, 15 రోజుల పాటు కరోనా చికిత్స పొందిన తర్వాత కూడా పాజిటివ్ వచ్చిందంటూ మళ్లీ మందులు వాడుతున్న వారు మరికొందరు. ఇలాంటి సొంత వైద్యం ధోరణులు పెరిగిపోతుండడం ఆందోళనకరం అని వైద్యులు పేర్కొంటున్నారు.

సాధారణంగా రెండు వారాల పాటు కరోనాకు చికిత్స పొందాక కూడా మానవదేహంలో కరోనా ఆర్ఎన్ఏ అవశేషాలు ఉంటాయని, దాని వల్ల కూడా కరోనా పాజిటివ్ వస్తుందని, ఒక్కోసారి తప్పుగా పాజిటివ్ రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. దాంతో తమకు కరోనా తగ్గలేదని ఎవరికివారే నిర్ణయించుకుని, విచక్షణరహితంగా ఔషధాలు వాడితే తీవ్ర అనర్ధాలు తప్పవని స్పష్టం చేశారు. 15 రోజుల పాటు కరోనాకు మందులు వాడాక, ఆపై కూడా మందులు వాడే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్లు వివరించారు.

సొంతంగా యాంటీబయాటిక్ మందులు, స్టెరాయిడ్లు తీసుకుంటే తీవ్రస్థాయిలో జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన కన్సల్టెంట్ వైద్యుడు డాక్టర్ రాహుల్ అగర్వాల్ వెల్లడించారు.

15 నుంచి 17 రోజుల పాటు మందులు వాడిన వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా సోకే అవకాశాలు ఉండవని, వారు ఇక మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదని యశోదా ఆసుపత్రి కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ బూరుగు హరికిషన్ వివరించారు. అయితే కొందరు అనుమానంతో పదేపదే టెస్టులు చేయించుకుంటూ, తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటారని పేర్కొన్నారు.


More Telugu News