పెను తుపానుగా తౌతే... ముంబయిలో వర్ష బీభత్సం

  • అరేబియా సముద్రంలో తౌతే తుపాను
  • మరింత బలం పుంజుకున్న తుపాను
  • ముంబయిని తాకుతూ వెళ్లిన వైనం
  • చిగురుటాకులా వణికిన ముంబయి
  • అతి భారీవర్షాలు, పెనుగాలులతో అతలాకుతలం
  • సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసిన మోదీ
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే పెను తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది ముంబయికి పశ్చిమ వాయవ్య దిశగా కేంద్రీకృతమైంది. అయితే, ముంబయికి ఇది సమీపంలోనే ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడి మెరైన్ డ్రైవ్ బీచ్ లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే ముంబయి నగరం అతి భారీ వర్షాలతో జలమయం అయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులు ముంబయిలోని అనేక చెట్లను పెకలించివేశాయి. లోకల్ రైల్ మార్గాలు, రోడ్లు దెబ్బతిన్నాయి.

రాగల కొన్ని గంటల్లో మరింత భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ పేర్కొన్నట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. కాగా, తౌతే ముంబయిని తాకుతూ వెళ్లిన నేపథ్యంలో నష్టం అపారంగానే ఉంటుందని ఐఎండీ వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలపైనా తౌతే ప్రభావం తీవ్రంగానే ఉంది. 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తౌతే నేపథ్యంలో ముంబయి ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై నిషేధాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసి తుపాను పరిస్థితులను తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపై ఆయన గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. ఈ రాత్రికి గుజరాత్ లోని పోరుబందర్-మహువా ప్రాంతాల మధ్య తౌతే పెను తుపాను రూపంలో తీరం దాటనుండడంతో భారీ విలయం తప్పదని ఐఎండీ ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. సీఎం విజయ్ రూపానీతో ముందు జాగ్రత్త చర్యలపై ప్రధాని మోదీ చర్చించారు. అన్ని విభాగాలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.


More Telugu News