ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా రోజువారీ కేసులు

  • గత 24 గంటల్లో 13,756 కేసుల నమోదు
  • తూర్పుగోదావరిలో 2,301 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 104 మరణాలు
  • ఒక్క పశ్చిమగోదావరిలోనే 20 మంది మృతి
  • తాజాగా 20,392 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఇటీవల నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్యే అందుకు నిదర్శనం. గడచిన 24 గంటల్లో 79,564 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,756 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,301 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 2,155 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 397 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

అయితే, మరణాల సంఖ్య మాత్రం ఇప్పటికీ 100కి పైనే నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఏపీలో 104 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 20 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 10 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య10,738కి చేరింది.

అదే సమయంలో 20,392 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,71,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,87,382 మంది కోలుకున్నారు. ఇంకా 1,73,622 మందికి చికిత్స జరుగుతోంది.


More Telugu News