రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు: సిద్ధిపేటలో సీఎం కేసీఆర్

  • సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
  • పలు భవనాలకు ప్రారంభోత్సవం
  • అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని వెల్లడి
  • ఎవరేమనుకున్నా పట్టించుకోబోమని స్పష్టీకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్ధిపేట విచ్చేశారు. సిద్ధిపేటలో నిర్మించిన పలు భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోవడంలేదని, తమ పని తాము చేసుకుపోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు.

తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో ముందున్న పంజాబ్ ను కూడా అధిగమించామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వస్తోందని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తోలు తీయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు.

ధరణి పోర్టల్ గురించి చెబుతూ, రాష్ట్రంలో భూఅక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఒక్కసారి ధరణి పోర్టల్ లో భూమి వివరాలు నమోదైతే, ఆ భూమి సొంతదారు ఇక నిశ్చింతగా ఉండొచ్చని పేర్కొన్నారు. వీఆర్ఓ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎవ్వరూ ఆ వివరాలను మార్చే వీల్లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో 37 చట్టాలున్నాయని, ఎలాంటి లొసుగులకు తావులేని విధంగా ధరణి పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించేందుకు మూడేళ్లు శ్రమించామని తెలిపారు.


More Telugu News