గతంలో ఇచ్చిన ఉద్యోగ హామీలపై చంద్రబాబు ఏం చేశారు?: సజ్జల

  • ఉద్యోగ నియామకాల అంశంపై మాటల యుద్ధం
  • సీఎం జగన్ కు లోకేశ్ లేఖ
  • సజ్జల ప్రెస్ మీట్
  • చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలిచ్చారన్న సజ్జల
ఏపీలో పరీక్షల అంశం ముగియడంతో ఇప్పుడు విపక్ష టీడీపీ నిరుద్యోగ అంశంపై దృష్టి సారించింది. నారా లోకేశ్ ఇప్పటికే సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 9,081 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 8,031 ఉద్యోగాలే భర్తీ చేశారని ఆరోపించారు. ఇదీ చంద్రబాబు ఘనకార్యం అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో కేవలం 34 వేల ఉద్యోగాలే ఇచ్చారని వెల్లడించారు.

కానీ సీఎం జగన్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తే మాత్రం టీడీపీ అనుకూల మీడియా ఎక్కడా రాయడంలేదు అని విమర్శించారు. సీఎం జగన్ ప్రమాణస్వీకారం నాటికి రాష్ట్రంలో 5,14,056 ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు 6,96,526 ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. ఓ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా జరిగిందా? అని సజ్జల ప్రశ్నించారు.

చంద్రబాబు, ఆయన కుమారుడు, వాళ్లను మోస్తున్న పత్రికలు, టీవీ చానళ్ల అధినేతలు పొద్దున లేచినప్పటి నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారని, వీరికి సిగ్గుందా? అని నిలదీశారు. సీఎం జగన్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది రాయకుండా, జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.

"అనుభవజ్ఞుడు అని భావించిన చంద్రబాబు రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేయలేదా? చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చిన విద్యారంగాన్ని ఇప్పుడు జగన్ చక్కదిద్దుతున్నారు. చంద్రబాబు గతంలో 620 హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేర్చలేదు. ఇప్పటికీ ఆయనను ప్రస్తుతిస్తూ, సీఎం జగన్ ను నిందిస్తూ పేజీలకు పేజీలు ఎందుకు వృథా చేసుకుంటున్నారో అర్థం కావడంలేదు" అని పేర్కొన్నారు.


More Telugu News