మా గవర్నర్‌ ఓ అవినీతిపరుడు: మమతా బెనర్జీ

  • 1996 జైన్‌ హవాలా ఛార్జిషీట్‌లో ధన్‌ఖడ్‌ ను చేర్చారు
  • ఇలాంటి వ్యక్తిని గవర్నర్‌ పదవిలో ఎలా కొనసాగిస్తారు
  • తొలగించాలని అనేకసార్లు లేఖ రాశా
  • బెంగాల్‌ను విభజించేందుకు కుట్ర
  • జగదీప్‌ ధన్‌ఖడ్‌ పై దీదీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్ ధన్‌ఖడ్‌ మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా దీదీ గవర్నర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనని అవినీతిపరుడిగా అభివర్ణించారు.

‘‘ఆయన(జగదీప్‌ ధన్‌ఖడ్‌) అవినీతిపరుడు. 1996 జైన్‌ హవాలా కుంభకోణం ఛార్జిషీట్‌లో ఆయన పేరును చేర్చారు. అయితే, కోర్టు కెళ్లి దానిని క్లియర్ చేసుకున్నారు. అయినా ఈ విషయంపై ఓ పిల్ వుంది. అదింకా పెండింగులోనే వుంది. డైరీ ద్వారా ఏయే రాజకీయ నాయకుడికి ముడుపులు ముట్టాయో బయటపడింది. అయినా, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యక్తిని గవర్నర్‌ పదవిలో ఎలా కొనసాగిస్తోంది?’’ అని మమత ప్రశ్నించారు. భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఎందుకు నియంత్రించాలని ప్రశ్నించారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు.

రాజ్యాంగం ప్రకారం.. తాను గవర్నర్‌ని కలుస్తానని, చర్చిస్తానని.. అన్ని సంప్రదాయాలను పాటిస్తానని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం తన లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఉత్తర బెంగాల్‌లో గవర్నర్‌ పర్యటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పైగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆయన కలిశారని ఆరోపించారు. బెంగాల్‌ను విభజించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

దీదీ వ్యాఖ్యలపై గవర్నర్‌ ధన్‌ఖడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు ఏ అవినీతి కుంభకోణంలోనూ నిందితుడిని కాదన్నారు. ఓ రాజకీయ నాయకురాలి నుంచి ఇలాంటి ఆరోపణలను తాను ఊహించలేదన్నారు.


More Telugu News