టీమిండియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక

  • నేటి నుంచి శ్రీలంకలో టీమిండియా పర్యటన
  • కొలంబో ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే
  • బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • దసున్ షనక నాయకత్వంలో ఆడుతున్న లంక
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య కాసేపట్లో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. దసున్ షనక నాయకత్వంలోని యువ శ్రీలంక జట్టు... అనుభవజ్ఞులతో కూడిన టీమిండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డపై ఆడుతుండడం లంక జట్టుకు కలిసొచ్చే అంశమే అయినా, ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల పిచ్ లపై ఆడిన అనుభవం టీమిండియా ఆటగాళ్ల సొంతం.

టీమిండియాలో ధావన్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, కుల్దీప్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరికితోడు పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, దీపక్ చహర్ వంటి ప్రతిభావంతులు కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు.

కాగా, ఈ సిరీస్ ఆరంభానికి ముందు లంక జట్టులో కరోనా కలకలం రేగింది. సిరీస్ జరగడంపై అనుమాన మేఘాలు ముసురుకున్నాయి. అయితే, లంక బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఇవాళ్టి మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమం అయింది.


More Telugu News