నా హత్యకు ఒక మంత్రి కుట్రపన్నడం నిజమే.. త్వరలోనే ఫొటోలు విడుదల చేస్తా: ఈటల రాజేందర్

  • మంత్రిపై నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా
  • ఓటమి భయంతో టీఆర్ఎస్ చిల్లర పనులకు పాల్పడుతోంది
  • నా పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు
కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నిన్న సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను చంపేందుకు ఒక హంతక ముఠాతో కూడా చేతులు కలిపారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ... ఈటల ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కాబట్టి సీబీఐ, ఎన్ఐఏలతో విచారణ జరిపించుకోవచ్చని సెటైర్ వేశారు. గంగుల మాట్లాడిన తర్వాత ఈటల రాజేందర్ ఈరోజు కూడా అదే అంశంపై మరోసారి స్పందించారు.

తనను హత్య చేసేందుకు ఒక మంత్రి కుట్ర పన్నారనే ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఈటల చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను త్వరలోనే విడుదల చేస్తానని తెలిపారు. ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతోందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు సబ్ ప్లాన్ నిధులను కూడా ఇవ్వలేదని విమర్శించారు.

హుజూరాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ హామీలు ఇస్తున్నారని ఈటల అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ మాదిరి డబ్బు పెట్టే శక్తి తనకు లేదని... అందుకే ప్రజల మధ్యకు వచ్చి, వారిని జాగృతం చేస్తున్నానని అన్నారు. తన పాదయాత్రకు అధికార పార్టీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఒక్కో ఓటుకు టీఆర్ఎస్ రూ. 10 వేలు ఇస్తుందట... ఆ డబ్బును తీసుకుని, ఓటును మాత్రం బీజేపీకే వేయాలని ప్రజలను కోరారు.


More Telugu News