వినియోగదారుల డేటాను చోరీ చేసిన ఇంటిదొంగలు.. ఉద్యోగం నుంచి తీసేసిన గూగుల్​!

  • గోప్యత నిబంధనల ఉల్లంఘన
  • 76 మందికి ఉద్వాసన
  • నివేదికలో వెల్లడించిన దిగ్గజ సంస్థ
సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యం ఏర్పడింది. మెయిల్ కావొచ్చు, మెసేజింగ్ యాప్ లు కావొచ్చు, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లు అయి ఉండొచ్చు.. మన సమాచారమంతా భద్రమేనా? అంటే.. ఆయా సంస్థలు ప్రైవసీ రూల్స్ పెట్టింది అందుకే మరి. కానీ, ఆ ప్రైవసీని కాపాడేందుకు పనిచేసే సంస్థ ఉద్యోగులే మన సమాచారాన్నంతా చోరీ చేస్తే?

అలాంటి ఉద్యోగులందరినీ గూగుల్ తీసిపారేసింది. ఓ నివేదికలో గూగుల్ ఈ విషయాలను వెల్లడించింది. డేటా దుర్వినియోగం చేసినందుకు మూడేళ్లలో 76 మందిని ఉద్యోగం నుంచి తీసేసినట్టు అందులో పేర్కొంది. గూగుల్ వినియోగదారులు, సంస్థ ఉద్యోగుల సమాచారాన్ని దొంగతనంగా వారు సేకరించారని వివరించింది.

గత ఏడాది 36 మందిని తొలగించినట్టు పేర్కొంది. అందులో 86 శాతం మంది రహస్య సమాచారాన్ని, గూగుల్ వ్యక్తిగత సమాచారాన్ని, వినియోగదారుల వివరాలను బయటి వ్యక్తులకు పంపించినట్టు తేలిందని వెల్లడించింది. మరో 10 శాతం మంది గూగుల్ వ్యవస్థను దుర్వినియోగపరిచినట్టు గుర్తించింది. 2019లో 26 మందిని, 2018లో 18 మందిని ఉద్యోగం నుంచి తీసేసినట్టు పేర్కొంది. వారిని హెచ్చరించి వదిలేసి ఉండొచ్చని, కానీ, వారి చర్యలు అంతకుమించి ఉన్నాయని గూగుల్ అభిప్రాయపడింది. ఆ నేరాన్ని తాము తక్కువగా చూడడం లేదని స్పష్టం చేసింది.


More Telugu News