తీన్మార్ మల్లన్న నివాసం, క్యూ న్యూస్ చానల్ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు

  • కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి ఫిర్యాదు
  • రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ధ్రువపత్రాలు స్వాధీనం
  • కేసీఆర్, కేటీఆర్ ఫొటోలకు మీసాలు తగిలించి అవమానించారని మరో కేసు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై యూట్యూబ్ చానల్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ క్యూ న్యూస్ కార్యాలయం, ఇంటిలో ఏకకాలంలో దాడులు చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిషాంక్ మంగళవారం ఫిర్యాదు చేయగా నిన్న సోదాలు నిర్వహించారు. సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, 40 హార్డ్ డిస్కులతోపాటు పలు ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, ఆయన కార్యాలయ ఆవరణలో ఉన్న ఇద్దరు విలేకరులను అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.  కాగా, తీన్మార్ మల్లన్నపై నిన్న మరో కేసు కూడా నమోదైంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలకు మీసాలు తగిలించి మల్లన్న తన యూట్యూబ్ చానల్‌లో అవమానపరిచారని పేర్కొంటూ ఓయూ విద్యార్థి రామారావుగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News