ప్రజలు బాగుపడాలో, ఈటల బాగుపడాలో ఆలోచించుకోండి: హరీశ్ రావు

  • హుజూరాబాద్ ఎన్నికపై హరీశ్ రావు వ్యాఖ్యలు
  • గెల్లు శ్రీనును గెలిపిద్దామని పిలుపు
  • కేసీఆర్ కు కానుకగా ఇద్దామని వెల్లడి
  • ఈటల, బీజేపీపై హరీశ్ విమర్శనాస్త్రాలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ ఇన్చార్జిలు, సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనును గెలుపు శ్రీనుగా మార్చి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఓటమి ఖరారైందని, అందుకే ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఇవాళ ఈటల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. అదే సమయంలో కేసీఆర్ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తారని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు బాగుపడాలో, ఈటల బాగుపడాలో ఓటర్లు ఆలోచించుకోవాలని సూచించారు.

ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల చేసిన అభివృద్ధి ఏదీ లేదని, ఇప్పుడు విపక్ష ఎమ్మెల్యేగా ఏం చేయగలరని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ ప్రజల కోసం రాజీనామా చేశారని, నేడు ఈటల ఎవరికోసం రాజీనామా చేశారో చెప్పాలని నిలదీశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు బీజేపీ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంస్థలను అమ్మడం తప్ప ఇంకేం చేసిందని ప్రశ్నించారు. అమ్మకానికి బీజేపీ ప్రతిరూపం అయితే, నమ్మకానికి టీఆర్ఎస్ ప్రతిరూపం అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తెలంగాణలో తీర్థయాత్రలు చేసే బదులు ఢిల్లీకి యాత్ర చేస్తే బాగుంటుందని హితవు పలికారు.


More Telugu News