నాకు చాలా రహస్యాలు తెలుసు... నిదానంగా బయటపెడతా: కేంద్రమంత్రి నారాయణ్ రాణే

  • ఇటీవల సీఎం థాకరేపై రాణే వ్యాఖ్యలు
  • మండిపడిన శివసేన
  • రాణేను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బెయిల్ పై విడుదలైన కేంద్రమంత్రి
కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర పోలీసులు తనను అరెస్ట్ చేయడం పట్ల కేంద్రమంత్రి నారాయణ్ రాణే తీవ్రస్థాయిలో స్పందించారు. తనను అరెస్ట్ చేయించడం ద్వారా థాకరే ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు.

'నేనేమైనా గ్యాంగ్ స్టర్ ని అనుకుంటున్నారా? ఎలాంటి నేరం చేయకుండా నన్ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం. చేతిలో ఉన్న అధికారాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో మేమూ అధికారంలోకి వస్తాం' అని పేర్కొన్నారు. అంతేకాదు, తనకు చాలా రహస్యాలు తెలుసని, ఒక్కొక్కటిగా అన్నీ బయటపెడతానని రాణే హెచ్చరించారు.

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని సీఎం ఉద్ధవ్ థాకరే వేదికపై పక్కనున్న వారిని అడగడం రాణేను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందో కూడా తెలియని ఆ సీఎంను చెంప చెళ్లుమనిపించాలని వ్యాఖ్యానించారు.

దాంతో శివసేన వర్గాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో బీజేపీ వర్గాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రత్నగిరి జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో ఉన్న కేంద్రమంత్రి రాణేను పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, రాణే రత్నగిరి జిల్లాలో జన ఆశీర్వాద యాత్రను కొనసాగిస్తున్నారు.


More Telugu News