నా సక్సెస్​ కు అదే చివరి అవకాశం అని తెలుసు: రోహిత్​ శర్మ

  • టెస్టుల్లో ఓపెనింగ్ పై హిట్ మ్యాన్ మనసులో మాట
  • 2019లో వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా
  • దాని కోసం ఎంతో క్రమశిక్షణగా ఉన్నా
  • మానసికంగా సంసిద్ధుడినయ్యా
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చాలా పట్టుదలతో ఆడాడు. చాలా బలహీన స్థితిలో ఉన్న భారత్ ను పటిష్ఠ స్థితికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. శతకం బాది తనేంటో చూపించాడు. 256 బంతుల్లో 127 పరుగులు చేసిన రోహిత్.. భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. రోహిత్ కిది కెరీర్ లో 8వ టెస్ట్ శతకం కాగా.. విదేశీ గడ్డపై మొదటిది కావడం విశేషం.

అయితే, ఓపెనర్ అయ్యాకే తాను టెస్టుల్లో బాగా సక్సెస్ అయ్యానని రోహిత్ చెప్పాడు. ‘‘టెస్టుల్లో వరుసగా విఫలమైన నాకు.. ఓపెనర్ గా అవకాశం వచ్చింది. నా విజయానికి అదే చివరి అవకాశం అని నాకు తెలుసు. 2019లో వచ్చిన ఆ అవకాశాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలతో శ్రమించాను’’ అని నాలుగో టెస్టు మూడో రోజు ఆట అనంతరం చెప్పుకొచ్చాడు.

మిడిల్ ఆర్డర్ లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పరుగులు చేయలేకపోయానని ఒప్పుకొన్నాడు. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పాడు. అయితే, ఆ అవకాశం రావడం మాత్రం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. 2019లో ఓపెనర్ గా అవకాశం రావడానికన్నా ముందే డ్రెస్సింగ్ రూంలో ఆ చర్చ జరిగిందన్నాడు. తన బ్యాటింగ్ పొజిషన్ పై ఎన్నో రకాలుగా చర్చించిన తర్వాతే పైకి ప్రమోట్ చేశారన్నాడు.

జట్టు యాజమాన్యం ఏమనుకుందో ఏమోగానీ.. తాను మాత్రం అదే చివరి అవకాశం అనుకున్నానని రోహిత్ వెల్లడించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగితే చాలా ఎక్కువ సేపు క్రీజులో నిలవాల్సి ఉంటుందన్నాడు. మానసికంగా అందుకు సంసిద్ధుడినయ్యానని, టెస్ట్ క్రికెట్ కు అవసరమైన క్రమశిక్షణను అలవర్చుకున్నానని చెప్పాడు.


More Telugu News