అనారోగ్యంతో కన్నుమూసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు కేశవ్ దేశిరాజు

  • చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కేంద్ర ఆరోగ్య, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా సేవలు
  • పదవీ విరమణ తర్వాత చెన్నైలో నివాసం
  • సంతాపం తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు (66) నిన్న కన్నుమూశారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమార్తె దేశిరాజు శకుంతల కుమారుడే కేశవ్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న కేశవ్ సివిల్స్‌లో సత్తాచాటి ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. కేంద్ర ఆరోగ్య, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత చెన్నై రాయపేటలో ఉండేవారు. ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రపై ఆయన రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ఈయన తండ్రి నరసింహారావు సైన్యంలో మేజర్‌గా సేవలందించారు. కేశవ్ మృతికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.


More Telugu News