నార్వేలో ముగిసిన 561 రోజుల లాక్ డౌన్... బార్లు, మందుషాపులకు పరుగులు తీసిన ప్రజలు
- నార్వేలో పూర్తిస్థాయిలో ఆంక్షల తొలగింపు
- తెరుచుకున్న బార్లు, నైట్ క్లబ్బులు
- ఎక్కడ చూసినా జనం కిటకిట
- అనేకచోట్ల హింసాత్మక ఘటనలు
నార్వేలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక 561 రోజుల అనంతరం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తేశారు. లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్టు 24 గంటల ముందు ప్రకటించగా, లాక్ డౌన్ ఎత్తేయగానే నార్వే ప్రజల సంబరం అంతాఇంతా కాదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మించిపోయేలా ఘనంగా ఉత్సవాలు చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు బార్లకు, మందుషాపులకు పోటెత్తడం కనిపించింది. వీధుల్లోనే మందుబాబులు విచిత్ర విన్యాసాలతో తమ ఆనందం వెలిబుచ్చారు. వీధి పోరాటాలతో పోలీసులకు పని కల్పించారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్బులు కిటకిటలాడిపోయాయి. ఎక్కడ చూసినా బాణసంచా వెలుగులతో జిగేల్మనిపించేలా వేడుకలు చేసుకున్నారు. సాధారణంగా ఎంతో శాంతియుతమైన దేశంగా నార్వేకు, సహృదయులైన ప్రజలుగా నార్వే వాసులకు పేరుంది. అక్కడ క్రైమ్ రేటు చాలా చాలా తక్కువ. అలాంటిది లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన కొన్ని గంటల్లో ఒక్క ఓస్లో నగరంలోనే 190 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయంటే అక్కడి ప్రజలు ఏ స్థాయిలో రెచ్చిపోయారో తెలుస్తోంది.