కేసీఆర్ తొండాట ఆడుతున్నారు: ఈటల

  • హుజూరాబాద్ లో కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవు
  • హరీశ్ రావు అన్నీ అబద్ధాలే చెపుతున్నారు
  • తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని కాను
టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో మీటింగులకు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను రప్పించి అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుస్తామనే నమ్మకం లేకే సీఎం కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని... తన టక్కుటమార విద్యలన్నింటిని హుజూరాబాద్ లో ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవని చెప్పేరోజు ఈనెల 30వ తేదీ అని చెప్పారు.

ఈటలను ఓడిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణను బానిసత్వంలో ఉంచవచ్చనేది కేసీఆర్ ఆలోచన అని అన్నారు. తనను ఎదుర్కొనే దమ్ము లేకే... తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య సవాల్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ నుంచి స్పందనే లేదని అన్నారు. హరీశ్ రావు అన్నీ అబద్ధాలే చెపుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు హరీశ్ పై ఎంతో గౌరవం ఉండేదని... మామకు పూర్తిగా బానిస అయి, ఇప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని చెప్పారు.
 
తన వద్దకు ఎవరు వచ్చినా... వారి ఇంటికి ఓ కారు వచ్చి హరీశ్ ఇంటికి తీసుకెళుతుందని ఈటల అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తాము హామీ ఇస్తున్నామని చెప్పారు. తనను గెలిపించి హూజూరాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలను ఈటల కోరారు.


More Telugu News