ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేవరకు, ఫీజు రీయింబర్స్ మెంట్ జరిగేవరకు పోరాటం కొనసాగుతుంది: రేవంత్ రెడ్డి

  • అమిస్తాపూర్ లో విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైరన్
  • హాజరైన రేవంత్
  • ప్రభుత్వంపై విమర్శలు
  • కాంగ్రెస్ కు పట్టం కట్టాలని విజ్ఞప్తి
విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేవరకు, ఫీజు రీయింబర్స్ మెంట్ జరిగే వరకు ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1.91 లక్షలు ఉద్యోగాలు రావాలన్నా, రూ.4 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్ మెంట్ జరగాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికగా తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ సీఎం కేసీఆర్ అన్నింటిని విస్మరించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగానే ఇవాళ పాలమూరు ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులను కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

కాగా, ఈ సభకు వచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల వద్ద ఆయన కాన్వాయ్ ని నిలిపివేసిన పోలీసులు... పట్టణంలోంచి కాకుండా ఫ్లైఓవర్ మీద నుంచి అమిస్తాపూర్ వెళ్లాలని సూచించారు. అయితే పోలీసుల నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు కదిలారు. ఈ క్రమంలో రేవంత్ కాన్వాయ్ జడ్చర్ల, మహబూబ్ నగర్ మీదుగా అమిస్తాపూర్ పయనం అయింది.


More Telugu News