మంత్రి హరీశ్ రావుపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత కోదండరెడ్డి

  • హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫిర్యాదు
  • హరీశ్ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణ
  • నెలరోజుల నుంచి మకాం వేశారని వెల్లడి
  • మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న కోదండరెడ్డి
తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఎస్ఈసీ శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. హరీశ్ రావు గత నెలరోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేసి, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బయటికి రప్పించాలని, లేదా మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు అయినా ఇవ్వాలని ఎస్ఈసీని కోరారు.

మంత్రి హోదాలో ఉన్న హరీశ్ రావు అధికార దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఓవైపు మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి సందేశం వెళుతుందో ఆలోచించాలని పేర్కొన్నారు.

అంతగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఉంటే, మంత్రి పదవికి హరీశ్ రావు దూరంగా ఉండాలని కోదండరెడ్డి హితవు పలికారు. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకునే గతంలో సీఈసీగా పనిచేసిన టీఎన్ శేషన్ విస్పష్టమైన రీతిలో మార్గదర్శకాలు తీసుకువచ్చారని వెల్లడించారు.


More Telugu News