500కు పైగా సినిమాల్లో నటించాడు.. అనారోగ్యంతో ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.. తమిళ హాస్య నటుడి దీనగాథ

  • 1979లో సినీరంగ ప్రవేశం చేసిన గుండు కల్యాణం
  • కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వైనం
  • అన్నాడీఎంకే పార్టీ కోసం పని చేసిన కల్యాణం
ప్రముఖ తమిళ హాస్య నటుడు గుండు కల్యాణం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన... రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన... ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తనను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నారు. 1979లో 'మళలై పట్టాలం' సినిమా ద్వారా ఆయన కోలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత 500కు పైగా చిత్రాలలో నటించారు.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే... మరోవైపు అన్నాడీఎంకే పార్టీలో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఎంజీఆర్, జయలలిత అంటే ఆయనకు అంతులేని అభిమానం. పలు ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే కిడ్నీ సమస్య ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది.

ఈ నేపథ్యంలో గుండు కల్యాణంను ఆదుకోవాలని జయలలిత వద్ద సహాయకుడిగా పని చేసిన పూంగుడ్రన్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అందరినీ కోరారు. జయ జీవించి ఉంటే కల్యాణంకు ఎలాంటి సమస్య ఉండేది కాదని చెప్పారు. కనీసం అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలైనా ఆయనను ఆదుకోవాలని విన్నవించారు.


More Telugu News