అది కోహ్లీ ఇష్టం.. టీ20 వరల్డ్ కప్ పై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే: వీరేంద్ర సెహ్వాగ్

  • నమీబియాతో మ్యాచే కెప్టెన్ గా కోహ్లీకి చివరి మ్యాచ్
  • టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లీ
  • వన్డే, టెస్ట్ కెప్టెన్సీపై స్పందించిన సెహ్వాగ్
  • అది అతడి వ్యక్తిగత నిర్ణయమని కామెంట్
నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ తో టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకొన్నాడు. వన్డే ఫార్మాట్లలోనూ అతడిని పక్కనపెట్టే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. తన అభిమాని అడిగిన ప్రశ్నకు ఫేస్ బుక్ లో బదులిచ్చాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమన్నది విరాట్ కోహ్లీ నిర్ణయమని, అయితే, టెస్ట్, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని తాను అనుకోవట్లేదని చెపాడు. లేదు.. కేవలం తాను ఆటగాడిగా మాత్రమే ఉండిపోవాలనుకుంటే అతడిష్టమని అన్నాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియా బాగా ఆడుతోందని, ఘనమైన రికార్డు కూడా ఉందని చెప్పాడు.

‘‘కోహ్లీ మంచి ఆటగాడు. దూకుడైన కెప్టెన్. జట్టును ముందుండి నడిపిస్తాడు. వన్డేలు, టెస్టులకు కెప్టెన్ ఉండడం, ఉండకపోవడం అతడి వ్యక్తిగత నిర్ణయం’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంత ఘోరంగా నిష్క్రమించడంపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

ధోనీ నాయకత్వంలో 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ కప్పు కూడా గెలవలేదని చెప్పాడు. గడ్డు పరిస్థితులొచ్చినప్పుడు జట్టుకు అందరం మద్దతుగా ఉండాల్సిందేనని, అయితే, టీమిండియా ఐసీసీ కప్పు గెలిచి చాలా ఏళ్లయిపోయిందని పేర్కొన్నాడు. ద్వైపాక్షిక సిరీస్ లు గెలిచినంత మాత్రాన చాలదని, జనమెప్పుడూ వరల్డ్ టైటిల్స్ నే గుర్తుంచుకుంటారని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.


More Telugu News