ఏపీ అసెంబ్లీలో అసలు ఏం జరిగింది? చంద్రబాబు ఎందుకు వెళ్లిపోయారు?

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ
  • పూర్తిగా వ్యక్తిగత అంశాలపైకి మరలిన చర్చ
  • మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. వ్యవసాయంపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి కొడాలి నాని పదేపదే టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ఉచ్చరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు... పదేపదే చంద్రబాబు పేరును ఎందుకు ఉచ్చరిస్తున్నారని ప్రశ్నించారు.

అయినా తగ్గని కొడాలి నాని.. చంద్రబాబులా తాము లుచ్ఛా పనులు చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంచల్ గూడ్ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ అని టీడీపీ నేతలు అన్నారు. కొడాలి నాని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు... తల్లికి, చెల్లికి ద్రోహం విషయాలపై కూడా చర్చించేందుకు తాను సిద్ధమని అన్నారు. ఆ తర్వాత ఇరు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు... గతంలో కన్నబాబు వేరే పార్టీలో ఉన్నప్పుడు 'జైల్లో మీటింగ్ పెట్టుకునే పార్టీ' అంటూ వైసీపీ గురించి మాట్లాడారని అన్నారు.

ఆ తర్వాత మొత్తం చర్చ వ్యక్తిగత విషయాలపైకి వెళ్లింది. 'గంటా... అరగంటా' అంటూ టీడీపీ నేతలు గోల చేశారు. మాధవరెడ్డిని చంపింది ఎవరు? వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరు? ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు టీడీపీనే అధికారంలో ఉందని వైసీపీ సభ్యులు అన్నారు.

ఈ గందరగోళం మధ్య చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ అవమానాలు భరించలేనని... ఈ సభలో పడరాని అవమానాలు పడుతున్నానని... మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని చెపుతూ సభ నుంచి వెళ్లిపోయారు.  


More Telugu News