రెండు లక్షల మంది భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

  • అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి నేపథ్యంలో చర్యలు
  • ఇతర యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా నిలిపివేత
  • ఎండ్ టు ఎండ్ ఎన్‌‌క్రిప్షన్ భద్రతపై మరోమారు భరోసా
అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి వంటి ఫిర్యాదులతో 2 లక్షల మంది భారతీయుల ఖాతాలను నిలిపివేసినట్టు వాట్సాప్ తెలిపింది. ఇతర యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. నిజానికి తాము నిషేధానికి ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

ఖాతాను తొలుత రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎలా వుంది? మెసేజింగ్ చేసేటప్పుడు ఎలా వుంది? అన్న అంశంతోపాటు, ఎవరైనా యూజర్ సదరు ఖాతా గురించి బ్లాక్ రిపోర్టు పంపడం, ఖాతా గురించి మరో యూజర్ రిపోర్టు పంపడం వంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తమ అనలిటిక్స్ బృందం పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే, తమ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఎంతో పటిష్టంగా ఉంటుందని వాట్సాప్ మరోమారు స్పష్టం చేసింది. మెసేజ్ పంపిన వారు, అందుకున్న వారు తప్ప మూడో వ్యక్తి ఆ మెసేజ్‌లను చూడలేరని వివరించింది.


More Telugu News