సౌదీ అరేబియాలో ఓ భారతీయ కుటుంబాన్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం

  • కొంతకాలంగా సౌదీలో ఉంటున్న జబీర్ కుటుంబం
  • జబీర్ కు ఉద్యోగ రీత్యా బదిలీ
  • కారులో వెళుతుండగా ప్రమాదం
  • ఐదుగురి మృతి
కేరళకు చెందిన మహ్మద్ జబీర్, ఆయన కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. జబీర్, ఆయన భార్య షబ్నం, వారి ముగ్గురు పిల్లలు లైబా, లుఫ్తీ, సాహా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జబీర్ కొంతకాలంగా సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి బదిలీ కావడంతో కుటుంబం సహా పయనమయ్యాడు. సామాన్లు ఓ ట్రక్ లో పంపించిన జబీర్, కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు.

అయితే, నిర్దేశిత గమ్యస్థానానికి లగేజి ట్రక్కు ముందుగా చేరుకుంది. జబీర్ కుటుంబం ఎంతకీ రాకపోవడంతో వారు ఆయన బంధువులకు సమాచారం అందించారు. జబీర్ బంధువులు ఇతర ఎన్నారైలను అప్రమత్తం చేయగా, అసలు విషయం వెల్లడైంది. జబీర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బిషా అనే ప్రాంతం వద్ద మరో వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ రోడ్డు ప్రమాదంలో జబీర్ తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు మరణించారు. దాంతో కేరళలోని ఆయన స్వస్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం వారి మృతదేహాలను భారత్ కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జబీర్ స్వస్థలం కేరళలోని కోజికోడ్ జిల్లా బైపోర్ ప్రాంతం.


More Telugu News