దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టు ప్రకటన... విహారికి చోటు

  • ఈ నెల 26 నుంచి జనవరి 15 వరకు టెస్టు సిరీస్
  • కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
  • రహానే, పుజారాల కొనసాగింపు
  • గాయపడిన జడేజా, గిల్, అక్షర్ లకు విశ్రాంతి
  • వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మకు సారథ్యం
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. జట్టు ఎంపిక కోసం సమావేశమైన ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ 18 మందితో జట్టును ఎంపిక చేసింది.  ఈ నెల 26 నుంచి జనవరి 15 మధ్య భారత్... దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు ఆడనుంది. ఈ  సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారు.

వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారాలకు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ కు హనుమ విహారిని ఎంపిక చేయని సెలెక్టర్లు... దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు కల్పించారు. జట్టులో కొత్త ముఖాలు ఏమీ లేవు. కాగా, రవీంద్ర జడేజా, శుభ్ మాన్ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ చహర్ గాయాలతో బాధపడుతున్నారని, అందుకే వారికి విశ్రాంతి కల్పించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

స్టాండ్ బై ఆటగాళ్లుగా నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చహర్, అర్జాన్ నగ్వాస్ వాలాలకు అవకాశం కల్పించారు.

టీమిండియా సభ్యులు వీరే...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.

ఇదిలావుంచితే, దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ కు సెలెక్టర్లు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. టీ20లతో పాటు వన్డేలకు కూడా రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించాలని నిర్ణయించారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ అనంతరం కోహ్లీ పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్నాడు. దాంతో కొన్నిరోజుల కిందట న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించారు. అయితే, వన్డేల్లో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడని క్రికెట్ వర్గాలు భావించినా, సెలెక్టర్లు భవిష్యత్ దృష్ట్యా రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది.


More Telugu News