డిచ్‌పల్లి మూడు హత్యల కేసులో నిందితుడి అరెస్ట్.. 15 ఏళ్ల వయసు నుంచే చోరీలు!

  • మంగళవారం అర్ధరాత్రి ఒకేసారి మూడు హత్యలు
  • హంతకుడు 9 ఏళ్ల గంధం శ్రీకాంత్ 
  • నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం
  • హత్యలు తానే  చేసినట్టు అంగీకారం
నిజామాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడు హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు 19 ఏళ్ల యువకుడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. డబ్బుల కోసం మద్యం మత్తులో హత్యలు చేసినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ నిన్న వెల్లడించారు.

మంగళవారం అర్ధరాత్రి డిచ్‌పల్లి మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న హార్వెస్టర్ షెడ్‌లో హర్పాల్ సింగ్, జోగిందర్ సింగ్, సునీల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాకు చెందిన 19 ఏళ్ల గంధం శ్రీకాంత్ ఈ కిరాతకానికి పాల్పడినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు.

15 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలకు అలవాటు పడిన శ్రీకాంత్.. హత్యలకు పాల్పడిన రోజు మద్యం మత్తులో హార్వెస్టర్ షెడ్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ బయట మంచంపై నిద్రిస్తున్న సునీల్ తలపై సుత్తితో మోది చంపేశాడు. ఆ తర్వాత షెడ్డులో కనిపించిన మద్యం తాగాడు. అనంతరం హర్పాల్ సింగ్, జోగిందర్ ‌సింగ్‌లపైనా దాడిచేసి చంపేశాడు. వారి సెల్‌ఫోన్లు, రూ. 2,800 నగదుతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు ముగ్గురు మద్యం తాగి నిద్రపోవడంతో తీవ్ర మత్తులో ఉన్నారని, ఆ కారణంగానే వారి నుంచి నిందితుడు శ్రీకాంత్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదని పోలీసులు తెలిపారు.

తస్కరించిన ఫోన్లలోని సిమ్ కార్డులను తీసేసిన శ్రీకాంత్ అందులోని ఓ దానిలో సిమ్‌కార్డు వేసి ఆన్‌చేశాడు. దీంతో పోలీసులకు సాంకేతిక ఆధారం లభించింది. దీని ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హత్యలు తానే చేసినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 2018లో ఓ దొంగతనం కేసులో శ్రీకాంత్ అరెస్టయ్యాడని, అప్పట్లో అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు పేర్కొన్నారు.  కాగా, నెల రోజుల క్రితం శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News