మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన యువ ఫుట్‌బాలర్.. ఇటీవలే వివాహం!

  • హార్ట్ ఎటాక్‌కు 9 నిమిషాల ముందు గోల్‌కీపర్‌ను ఢీకొట్టిన లౌకర్
  • గాయమైన తలకు చికిత్స తర్వాత మళ్లీ ఆడుతుండగా గుండెపోటు
  • సీపీఆర్ ద్వారా బతికించే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం
ఇటీవలే వివాహం చేసుకున్న అల్జీరియాకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. అతడి మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం నివ్వెరపోయింది. సోఫియాన్ లౌకర్ (30) మౌలౌడియా సైదాకు సారథ్యం వహిస్తున్నాడు. ఒరాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.

హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలడానికి ముందు తన జట్టు గోల్‌కీపర్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో తలకు గాయమైంది. మైదానంలో చికిత్స అందించిన తర్వాత మ్యాచ్ ఆడేందుకు అనుమతి పొందాడు. ఆ తర్వాత 9 నిమిషాలకే గుండెపోటుతో మరణించడంతో జట్టు సభ్యులు షాక్‌లోకి వెళ్లిపోయారు. కాగా, లౌకర్ కొన్ని వారాల క్రితమే వివాహం చేసుకున్నాడు.

గుండెపోటుతో లౌకర్ మైదానంలో కుప్పకూలిన తర్వాత వైద్య సిబ్బంది అప్రమత్తమై మైదానంలోనే నోటి ద్వారా అతడికి గాలి అందించి (సీపీఆర్) ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఇలా మరణించడం ఈ వారంలో ఇది రెండోసారి. గత శుక్రవారం మారిన్ కాసిక్ కూడా ఇలానే హార్ట్ ఎటాక్‌తో మైదానంలోనే ప్రాణాలు విడిచాడు.


More Telugu News