తన భార్య గురించి ఏ భర్తా వినకూడని మాటను ఎమ్మెల్యే కుమారుడి నోటి నుంచి విన్నాను.. వెలుగులోకి నాగ రామకృష్ణ మరో వీడియో!

  • నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎ2 నిందితుడిగా వనమా రాఘవేంద్రరావు
  • ఆత్మహత్యకు గల కారణాలను పూసగుచ్చినట్టు వివరించిన రామకృష్ణ
  • ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదం
  • నా భార్యను హైదరాబాదుకు తీసుకురమ్మన్నారు
  • ఇంకా చిక్కని ఎమ్మెల్యే కుమారుడు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుస్తుండగా తాజాగా, ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చి ప్రకంపనలు రేపుతోంది. రామకృష్ణ ఈ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను పూసగుచ్చినట్టు వివరించారు.

ఎమ్మెల్యే కుమారుడు రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని రామకృష్ణ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని కోరారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాదుకు తీసుకురావాలని కోరారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని అన్నారు. తాను ఒక్కడిని వెళ్లిపోతే (ఆత్మహత్య చేసుకుంటే) తన భార్య, పిల్లలను ఆయన వదిలిపెట్టరని, అందుకనే తనతోపాటు వారినీ తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన తనపై తన తల్లి, సోదరి కక్ష సాధించారని రామకృష్ణ ఆ సెల్ఫీ వీడియోలో వివరించారు. కాగా, ఈ కేసులో ఎ2గా ఉండి, పరారీలో ఉన్న రాఘవేంద్ర కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


More Telugu News