జల్లికట్టులో విషాదం... యజమానినే చంపేసిన వృషభం

  • పొంగల్ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు
  • సురియూర్ గ్రామంలో ఘటన
  • యజమానిపైకి కొమ్ములు విసిరిన ఎద్దు
  • తీవ్ర రక్తస్రావంతో యజమాని మృతి
తమిళనాడులో పొంగల్ వేడుకల సందర్భంగా జల్లికట్టు పోటీలు నిర్వహించడం ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఈ సాహసోపేతమైన క్రీడలో బలిష్టమైన వృషభాలను లొంగదీయాల్సి ఉంటుంది. అయితే, తిరుచ్చి సమీపంలోని సురియూర్ గ్రామంలో జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని సొంత ఎద్దు చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి తన ఎద్దును సురియూర్ గ్రామానికి తీసుకువచ్చాడు.

అయితే, ఆ వృషభానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జల్లికట్టు బరి వద్దకు తీసుకెళుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ఎద్దు ఒక్కసారిగా కొమ్ములు విసరడంతో మీనాక్షి సుందరానికి తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.


More Telugu News