ప్రియాంక గాంధీ కార్యదర్శికి లంచం ఇవ్వలేకపోయా.. అందుకే టికెట్ రాలేదు: ప్రియాంక మౌర్య

  • ప్రియాంక మౌర్యకు టికెట్ నిరాకరణ
  • లంచం ఇవ్వలేకపోవడం వల్లే టికెట్ దక్కలేదని ఆరోపణ
  • త్వరలోనే కాషాయ గూటికి..!
యూపీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని, తద్వారా ఢిల్లీకి బాటలు వేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ‘లడ్‌కీ హూ.. లడ్ సక్‌తీ హూ (నేను బాలికను.. అయినా పోరాడగలను) అంటూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ జనం దృష్టిని ఆకర్షిస్తున్న యూపీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ప్రియాంక మౌర్య త్వరలోనే బీజేపీ గూటికి చేరబోతున్నారు.

వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించిన ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె పార్టీని వీడి బీజేపీ గూటికి చేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తనకు టికెట్ దక్కకపోవడంపై ప్రియాంక మౌర్య మాట్లాడుతూ.. పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తన పేరును, సామాజిక మాధ్యమాల్లో తనకున్న 10 లక్షల మంది ఫాలోవర్లను కాంగ్రెస్ వాడుకుందని, అయినా, తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చాలా అన్యాయమని, తాను ఓబీసీ మహిళను కాబట్టే తనకు టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కార్యదర్శి సందీప్ సింగ్‌కు తాను లంచం ఇవ్వలేకపోయానని, అందుకే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు.


More Telugu News