మళ్లీ ఎన్డీయేనే.. ప్రధాని మోదీకే ప్రజల పట్టం.. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి

  • 58 శాతం మంది ఎన్డీయే ప్రభుత్వంపై సంతృప్తి
  • ఆ సర్కారే మళ్లీ రావాలని 59% మంది అభిప్రాయం
  • మోదీ పనితీరు బాగుందన్న 63% మంది
  • ప్రధానిగా ఆయనే కావాలంటున్న 52.5%
  • రాహుల్ గాంధీకి కేవలం 6.8 శాతం ఓట్లు
ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు పెడితే ఎవరు అధికారంలోకి వస్తారు? ప్రజలు ఎవరిని ప్రధానిగా కోరుకుంటున్నారు? అని అడిగితే.. ఎన్డీయేకే ఓటేశారు. ఎక్కువ మంది నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ‘ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో ప్రజలు ఎన్డీయే వైపే మొగ్గు చూపారు. రైతుల ఉద్యమం హోరుగా సాగినా, కరోనా వైఫల్యాలు వెన్నాడినా, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడిచినా ఎక్కువ మంది మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని కోరుకుంటున్నారు.  

సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది ప్రజలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మోదీ పనితీరు బాగుందని 63 శాతం మంది ఓటేశారు. అయితే, గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఆయనకు పడిన ఓట్లు కేవలం 54 శాతమే కావడం గమనార్హం. కానీ, 2020 ఆగస్టులో ఆయన పనితీరు బాగున్నట్టు 78 శాతం మంది చెప్పారు. దానితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన 63 శాతం ఓట్లతో ఆయన చాలా దూరంలోనే ఉన్నారని చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎన్డీయేకి 296 సీట్లు వస్తున్నట్టు తేలింది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన 352 సీట్లతో పోలిస్తే చాలా తక్కువ. కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీజేపీకి 271 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. గతంలో వచ్చిన 303 సీట్లతో పోలిస్తే 32 సీట్లు తక్కువ. అదే కాంగ్రెస్ కు గతంలో వచ్చిన 52 సీట్లకు అదనంగా మరో పది సీట్లు పెరగనున్నాయి.

అయితే, ప్రధాని మోదీకి దగ్గర్లో మాత్రం ఎవరూ లేరు. రాహుల్ గాంధీ కనీసం మోదీ దరిదాపుల్లోకే రాలేదు. తర్వాతి ప్రధానిగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగితే.. నరేంద్ర మోదీకి 52.5 శాతం మంది ఓటేశారు. అంతకుముందుతో పోలిస్తే మోదీకి ఆదరణ భారీగా పెరగడం విశేషం. గత ఏడాది ఆగస్టులో చేసిన సర్వేలో కేవలం 24 శాతం మందే మోదీకి అనుకూలంగా ఓటేశారు.

ఇక, రాహుల్ గాంధీని కేవలం 6.8 శాతం మందే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. యోగికి 5.7 శాతం మంది, అమిత్ షాకు 3.5 శాతం మంది, ప్రియాంక గాంధీకి 3.3 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. సోనియాగాంధీకి కేవలం 3 శాతం మందే ఓటేయడం గమనార్హం. ఇక కూటమి ఏర్పాటు చేస్తే ప్రధాని రేసులో ఉన్న మమతా బెనర్జీని 2.6 శాతం మందే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే రావాలని 59 శాతం మంది కోరుకున్నారు.

కరోనా మహమ్మారిని ఎన్డీయే ప్రభుత్వం బాగానే హ్యాండిల్ చేసిందని 22.2 శాతం మంది చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రధానికి చాలా మంది మద్దతుగానే ఉన్నారు. యూపీలో 75 శాతం మంది, గోవాలో 67, మణిపూర్ లో 73 శాతం, ఉత్తరాఖండ్ లో 59 శాతం, పంజాబ్ లో 37 శాతం మంది మోదీకి అనుకూలంగా ఓటేశారు.

ఇక ప్రధాని మోదీ వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. 24.5 శాతం మంది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అని జవాబిచ్చారు. ఆ తర్వాత 13.6 శాతం మంది నిరుద్యోగం అని చెప్పారు. రైతుల నిరసనలకు 10.3 శాతం మంది, కరోనా మహమ్మారి నియంత్రణలో వైఫల్యమని 7.9 శాతం, నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం అని 6.2 శాతం మంది చెప్పారు.


More Telugu News