ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు రీఓపెన్

  • కరోనా నేపథ్యంలో సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించిన ప్రభుత్వం
  • ప్రస్తుతం రాష్ట్రంలో అదుపులోకి వస్తున్న కరోనా
  • పలు రాష్ట్రాల్లో తెరుచుకుంటున్న పాఠశాలలు
తెలంగాణలో స్కూళ్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. కరోనా క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లను తెరుస్తున్నారు. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది.

కరోనా వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులకు సరైన విద్యాబోధన జరగలేదు. ఆన్ లైన్ లో బోధన జరిగినప్పటికీ... విద్యార్థులకు దాని వల్ల మంచి కంటే, చెడే ఎక్కువ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో విద్యాబోధన ప్రత్యక్షంగా జరగాలనే పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీంతో, విద్యాసంస్థలను రీఓపెన్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఒమిక్రాన్ వచ్చిన తర్వాత జనవరి 8 నుంచి జనవరి 16 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఆ తర్వాత సెలవులను 31 వరకు పొడిగించింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లను తిరిగి తెరుస్తారా? లేదా? అనే సందేహాలు సర్వత్ర నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లను తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే స్కూళ్లలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది.


More Telugu News