భారత్–వెస్టిండీస్ సిరీస్ వాయిదా?

  • జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లకు కరోనా
  • ఇప్పటికైతే షెడ్యూల్ లో మార్పు లేదన్న బీసీసీఐ అధికారి
  • మరిన్ని కేసులొస్తే 3 రోజులు ఆలస్యంగా సిరీస్
  • ఇవాళ్టి ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసిన యాజమాన్యం
ఈ ఏడాది తొలి సిరీస్ వేటను స్వదేశంలో మొదలుపెట్టనున్న భారత్ కు.. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మరో మూడు రోజుల్లో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుండగా.. ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు ఐదుగురు సపోర్టింగ్ స్టాఫ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ తో సిరీస్ సాఫీగా సాగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్ లో మొదలయ్యే మ్యాచ్ తో భారత్ తన 1000వ వన్డే మ్యాచ్ నూ పూర్తి చేసుకోనుంది. వెయ్యో వన్డేకి నేతృత్వం వహించనున్న కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. అయితే, కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జట్టులో కరోనా కేసులు మరిన్ని పెరిగితే సిరీస్ ను రెండు మూడు రోజుల పాటు వాయిదా వేసే సూచనలున్నట్టు చెబుతున్నారు. అయితే, దీనిపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేశారు. ఒకవేళ మ్యాచ్ ఫిక్స్ చేసుకున్న డేట్ కే మొదలైతే శిఖర్ ధావన్ కు బదులుగా మయాంక్ అగర్వాల్ తో ఓపెనింగ్ చేయించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇటు మనీశ్ పాండేనూ జట్టులోకి తీసుకున్నారు.

‘‘ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే సిరీస్ జరుగుతుంది. జట్టులో మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడితే రెండు మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఇప్పటికే వెస్టిండీస్ ఆటగాళ్లు భారత్ కు వచ్చేశారు. ‘‘అహ్మదాబాద్ కు వచ్చేశాం. ఇండియా సేఫ్. ఈ సిరీస్ ఇలాగే కొనసాగనీ..’’ అంటూ వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ట్వీట్ చేశాడు.


More Telugu News