టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ గెల‌వ‌డంపై మోదీ, గంగూలీ, సెహ్వాగ్, యువీ స్పంద‌న‌

  • భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లో ఉంది:  మోదీ
  • యువ భారత్‌కు శుభాకాంక్ష‌లు: గంగూలీ
  • ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు:  సెహ్వాగ్
  • రవికుమార్‌, రాజ్‌ బవా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు:  యువ‌రాజ్
అద్భుత‌ ప్రదర్శనతో అండర్ 19 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి చివరి వరకు యువ ఆటగాళ్లు అద్భుత‌ ప్రదర్శన క‌న‌బ‌ర్చార‌ని ప్ర‌శంసించారు. భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లో ఉందనడానికి యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనే నిదర్శనమ‌ని మోదీ ట్వీట్‌ చేశారు.

అలాగే, ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. అలాగే, ఈ విజయానికి కారణమైన సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌ని అన్నారు. తాము ఈ ఆటగాళ్లకు ప్రకటించిన రూ.40 లక్షల నగదు బహుమతి కేవలం వారిని ప్రోత్సహించడానికేన‌ని అన్నారు.

క్రికెట‌ర్లు సాధించింది అంతకన్నా ఎక్కువేన‌ని చెప్పారు. ఒత్తిడిలోనూ ప్రతి ఆటగాడు అద్భుతంగా రాణించాడని ఆయ‌న ప్ర‌శంసించారు. ఐదవ‌సారి ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌ని మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించార‌ని ఆయ‌న చెప్పారు. కుర్రాళ్లు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినందుకు శుభాకాంక్షలు చెబుతున్న‌ట్లు మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ చెప్పారు. రవికుమార్‌, రాజ్‌ బవా అద్భుతంగా బౌలింగ్‌ చేశారని ఆయ‌న అన్నారు. టీమిండియా భవిష్యత్‌ గొప్పగా ఉంటుంద‌ని, కుర్రాళ్లు బాగా ఆడారని, వారిని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు.



More Telugu News