కుటుంబం అండగా.. వేద మంత్రాల సాక్షిగా.. ఘనంగా ట్రాన్స్ జెండర్ జంట వివాహం

  • వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న పెళ్లి
  • చట్టబద్ధత కోసం హైకోర్టుకు వెళ్లనున్న దంపతులు
  • 2010లో తొలిసారి కలుసుకున్న జంట
ఈ సమాజం అంగీకరించలేని శరీరతత్వం వాళ్లది. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు వాళ్లు. ప్రేమలో పడ్డారు. కానీ, సమాజమేమో ఆ ప్రేమ, పెళ్లిని అంగీకరించదాయె. అయితేనేం.. కుటుంబం, స్నేహితులే అండగా నిలవగా.. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే వారిద్దరూ సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో నిన్న జరిగిందీ చట్టం, సమాజం అంగీకరించని పెళ్లి.  

శ్యామా ఎస్. ప్రభ, మను కార్తీక అనే ట్రాన్స్ జెండర్లు నిన్న పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. త్రిశూర్ కు చెందిన వరుడు మనూ టెక్నోపార్క్ లోని ఓ ఐటీ సంస్థలో జాబ్ చేస్తుండగా.. తిరువనంతపురానికి చెందిన శ్యామ కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. ఎప్పట్నుంచో ప్రేమలో పడిన వాళ్లిద్దరూ తాజాగా పెళ్లి చేసుకున్నారు.

అయితే, ప్రస్తుత వివాహ చట్టాల ప్రకారం వారి పెళ్లి ఆమోదయోగ్యం కాకపోవడంతో.. తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేయాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్నామని మను చెప్పాడు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు. తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తమ పెళ్లికి అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ రోజు కోసమే తామిద్దరం ఎంతో కాలంగా వేచిచూశామన్నాడు.

2010లో క్వీర్ ఉద్యమం సందర్భంగా తొలిసారి ఇద్దరం కలుసుకున్నట్టు శ్యామా చెప్పింది. 2017లో తొలిసారిగా మనూనే తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. ఇద్దరం తమతమ ఇళ్లలో పెద్దవాళ్లమవడం వల్ల ఎన్నో బాధ్యతలు భుజాన పడ్డాయని, అవి తీరాక పెళ్లి చేసుకుందామనే ఇన్నాళ్లూ ఆగామని పేర్కొంది.


More Telugu News