భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక

  • ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్
  • 18 మందితో కూడిన జట్టును ప్రకటించిన శ్రీలంక
  • కెప్టెన్‌గా దాసున్ షనక
భారత్‌తో ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక బోర్డు తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక ప్రస్తుత టీ20 కెప్టెన్ దాసున్ షనక 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టుకు సారథ్యం వహిస్తాడు. చరిత్ అసలంకకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గాయాల కారణంగా అవిష్క ఫెర్నాండో, నువాన్ తుషార, రమేశ్ మెండిస్ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. కరోనా కారణంగా ఇటీవల జట్టుకు దూరమైన వనిందు హసరంగ తిరిగి జట్టులో చేరాడు. అన్‌క్యాప్‌డ్ స్పిన్నర్ ఆషియన్ డేనియల్‌కు చోటు కల్పించినప్పటికీ మినిస్టీరియల్ అప్రూవల్ రావాల్సి ఉంది.

భారత పర్యటనలో శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రీలంక 1-4తో ఓటమి పాలవగా, భారత జట్టు మాత్రం జోరుమీదుంది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే, అంతే సంఖ్యలోని టీ20 సిరీస్‌లలో పర్యాటక జట్టును వైట్‌వాష్ చేసింది.

శ్రీలంక జట్టు:  దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమల్, దనుష్క గుణతిలక, కామిల్ మిశ్రా, జనిత్ లియనాగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండెర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియన్ డేనియల్ (మినిస్టీరియల్ అప్రూవల్‌ను బట్టి)

భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ఈ నెల 24న లక్నోలో జరగనుండగా, 26, 27వ తేదీల్లో ధర్మశాలలో చివరి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 4-8 మధ్య జరగనున్న తొలి టెస్టుకు మొహాలీ ఆతిథ్యమివ్వనుండగా, మార్చి 12-16 మధ్య జరిగే రెండో టెస్టుకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది.


More Telugu News