మీ గుండెకు ముప్పు వద్దనుకుంటే ఇలా జీవించాల్సిందే!

  • ప్రతిరోజూ నడక తప్పనిసరి 
  • కనీసం 10 నిమిషాలు నడిచినా ప్రయోజనం
  • ప్రాణాయామం, ధ్యానంతో మంచి ఫలితం
  • ఉదయం కడుపు మాడ్చొద్దు
జీవనశైలి పద్ధతి ప్రకారం ఉంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడం సాధ్యమవుతుంది. పద్ధతి లేని జీవనశైలితో ముందుగా ప్రభావం పడేది గుండెపైనే. అందుకని కొన్ని చిన్న మార్పులతో మన గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నడక దివ్యౌషధం.. 
రోజులో ఒక్కసారి అయినా కనీసం 10 నిమిషాల పాటు నడవడం సదా శ్రేయస్కరం. వైద్యులు వారంలో ఐదు రోజుల పాటు, ప్రతి రోజు 30 నిమిషాలు నడవాలని సూచిస్తుంటారు. అందరికీ ఇది సాధ్యపడొచ్చు, పడకపోవచ్చు. వీలు కాని వారు కనీసం 10 నిమిషాల పాటు నడవాలి. దీనివల్ల కరోనరీ హార్ట్ డిసీజెస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. గుండెను కాపాడే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇంటి పనుల కోసం మెషిన్లపై ఆధారపడకుండా, స్వయంగా ఆచరించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అల్పాహారం
చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను సీరియస్ గా తీసుకోరు. రోజువారీ బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) తీసుకునే వారితో పోలిస్తే తీసుకోని వారిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్టు మోనాష్ యూనివర్సిటీ ఎపిడెమాలజీ, ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం నిర్వహించిన పరిశోధన తేల్చింది. నిత్యం బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారికి 21 శాతం అధికంగా గుండె జబ్బుల రిస్క్ ఉంటున్నట్టు వీరు గుర్తించారు. ఉదయం వేళల్లో జీవక్రియలు ఎక్కువ క్రియాశీలంగా ఉంటాయి. అందుకని ఆ సమయంలో ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

కేలరీల లెక్క ముఖ్యం..
తీసుకునే ఆహారంతో ఎన్ని కేలరీలు శరీరంలోకి చేరుతున్నాయనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. పరిమితికి మించి కేలరీలు తీసుకోవడం వల్ల గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. మహిళలు అయితే 2,000 కేలరీలు, పురుషులు అయితే రోజుకు 2,500 కేలరీలు తీసుకుంటే సరిపోతుంది.

ప్రాణాయామం చేయాలి..
ప్రాణాయామం, ధ్యానం అన్నవి మనసును ప్రశాంతంగా ఉంచడంలో సాయపడతాయి. మానసిక ఆరోగ్యంతో శారీరక ఆరోగ్యం కూడా దానంతట అదే అలవడుతుంది. ముఖ్యంగా ప్రాణాయామం గుండెకు మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో వైద్యులు గుర్తించారు. జీవనశైలి ఒత్తిడుల దుష్ప్రభావాన్ని తొలగించుకునేందుకు ఇదే చక్కని మార్గం. సానుకూల దృక్పథం కూడా సాయపడుతుంది.


More Telugu News