ఆ ప‌త్రిక సారీ చేప్పేదాకా వ‌దిలేదు లేదు: నారా లోకేశ్

  • గ‌తంలో లోకేశ్ పై సాక్షి ప‌త్రిక క‌థ‌నం
  • అది త‌ప్ప‌ని వివ‌ర‌ణ పంపిన లోకేశ్
  • వివ‌ర‌ణ‌ను ప్ర‌చురించని సాక్షి ప‌త్రిక‌
  • రూ.75 కోట్ల‌కు లోకేశ్ ప‌రువు న‌ష్టం దావా 
  • చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన కేసు విచార‌ణ‌
త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాలు రాసిన ప‌త్రిక త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పేదాకా వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ స్ప‌ష్టం చేశారు. త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాన్నిరాసిన సాక్షి దిన‌ప‌త్రిక‌పై రూ.75 కోట్లకు ప‌రువు న‌ష్టం దావాను గ‌తంలోనే లోకేశ్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా క్రాస్ ఎగ్జామినేష‌న్ ప్ర‌క్రియకు స్వ‌యంగా తానే హాజ‌రు కావాల‌న్న ఉద్దేశ్యంతోనే గురువారం విశాఖ వ‌చ్చాన‌ని చెప్పిన లోకేశ్‌.. కోర్టు విచార‌ణ ముగిసిన త‌ర్వాత అక్క‌డే మీడియాతో మాట్లాడారు.

'చిన‌బాబు చిరు తిండి రూ25 ల‌క్ష‌లండి..' అన్న శీర్షికతో సాక్షి ప‌త్రిక త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించింద‌ని లోకేశ్ ఆరోపించారు. ఈ క‌థ‌నాన్ని చూసి మ‌రో ప‌త్రిక‌, ఓ మేగ‌జీన్ కూడా ఇదే త‌ర‌హా క‌థ‌నాల‌ను రాశాయ‌ని ఆయ‌న చెప్పారు. అయితే దానిపై తాను వివ‌ర‌ణ పంపించ‌డంతో పాటు వాస్త‌వాల‌ను కూడా ఆయా ప‌త్రిక‌ల‌కు తెలియ‌జేశాన‌ని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఆ వివ‌ర‌ణ‌ను చూసిన మేగ‌జీన్ త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పింద‌ని, అయితే సాక్షి, మ‌రో ప‌త్రిక మాత్రం ఇప్ప‌టిదాకా క‌నీసం త‌న వివ‌ర‌ణ‌ను కూడా ప్ర‌చురించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాజ‌కీయంగా తాను ఎద‌గ‌కుండా ఉండేలా కుట్ర‌లు చేస్తున్న క్ర‌మంలోనే సాక్షి ప‌త్రిక త‌న‌పై బుర‌ద‌జ‌ల్లింద‌ని లోకేశ్ పేర్కొన్నారు. ఈ కార‌ణంగానే సాక్షి ప‌త్రికపై రూ.75 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన‌ట్లు చెప్పారు. ఈ కేసు విచార‌ణ‌ను మ‌రింత కాలం పొడిగించేలా కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని, అయితే న్యాయ‌మూర్తి మాత్రం ఈ కేసును ఈ నెల 28లోగానే ముగించే దిశ‌గా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికైనా మించిపోయిందేమీ లేద‌ని సాక్షి ప‌త్రిక త‌న త‌ప్పు ఒప్పుకుని త‌న‌కు క్ష‌మాప‌ణ చెబితే ఆ ప‌త్రిక యాజ‌మాన్యాన్ని క్ష‌మిస్తాన‌ని లోకేశ్ చెప్పారు.


More Telugu News