బిడ్డను పోగొట్టుకున్న బాధను దిగమింగి.. సెంచరీ బాదిన యువ క్రికెటర్

  • చండీఘర్ తో సౌరాష్ట్ర రంజీ మ్యాచ్
  • రెండో రోజు సెంచరీతో మెరిసిన విష్ణు సోలంకి
  • కొన్నాళ్ల క్రితం పుట్టిన బిడ్డ.. మరుసటి రోజే మృతి
  • మూడు రోజుల క్రితమే జట్టుతో కలిసిన విష్ణు
ఓ వైపు కూతురు చనిపోయిన బాధ గుండెల్ని పిండేస్తున్నా.. మైదానంలోకి దిగి శతకం బాదాడు బరోడాకు చెందిన యువ క్రికెటర్ విష్ణు సోలంకి. ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో రంజీ ట్రోఫీ మ్యాచులు జరుగుతున్నాయి. దీంతో అతడు కూడా తన సౌరాష్ట్ర టీమ్ తో పాటు భువనేశ్వర్ కు వెళ్లాడు. ఈ నెల 11న తనకు బిడ్డ పుట్టిందంటూ అతడికి ఫోన్ వచ్చింది. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. జస్ట్ 24 గంటల్లోనే అతడికి ఇంకో ఫోన్ వచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయిందంటూ ఫోన్ లో షాకింగ్ విషయం చెప్పారు. 

దీంతో హుటాహుటిన భువనేశ్వర్ నుంచి విష్ణు సోలంకి వడోదరకు వెళ్లిపోయాడు. బిడ్డ అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఆ బాధలోనే మూడు రోజుల క్రితం భువనేశ్వర్ లోని జట్టుతో కలిశాడు. మొన్ననే వికాస్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా చండీఘర్ తో ఆరంభమైన రంజీ మ్యాచ్ లో నిన్న శతకంతో మెరిశాడు. 

బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసిన చండీఘర్ జట్టు 168 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌరాష్ట్ర జట్టు కుదుపులకు లోనైంది. ఐదో స్థానంలో వచ్చిన విష్ణు సోలంకి.. బిడ్డ పోయిన బాధను గొంతులో దిగమింగుకుని క్రీజులో పట్టుదలగా నిలిచాడు. 161 బంతులాడి 103 పరుగులతో అజేయంగా నిలిచి ఆట రెండో రోజును ముగించాడు. 

కాగా, అతడి మనోధైర్యాన్ని క్రికెటర్లు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తనకు తెలిసిన దృఢమైన ఆటగాళ్లలో విష్ణు సోలంకి ముందుంటాడని మరో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ కొనియాడాడు. బిడ్డను కోల్పోవడం జీర్ణించుకోలేని విషయమని, ఇంతటి కష్టకాలంలో దృఢంగా ఉన్న విష్ణు, అతడి కుటుంబానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి మరెన్నో శతకాలు బాదాలని, కెరీర్ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించాడు.


More Telugu News