ఏపీ ప్రభుత్వం పవన్ పై కక్షగట్టింది... సినీ పెద్దలు స్పందించకపోవడం బాధాకరం: నాగబాబు

  • భీమ్లా నాయక్ విడుదల
  • ఏపీలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ తొలిరోజు ప్రదర్శనలు
  • పవన్ పై పగతోనే ఇలా చేస్తున్నారన్న నాగబాబు
  • ఎవరూ నోరుమెదపడంలేదని అసంతృప్తి
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ శుక్రవారం రిలీజ్ కాగా, ఏపీలో తీవ్ర పరిస్థితుల నడుమ ప్రదర్శనలు సాగాయి. ఈ నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. వకీల్ సాబ్ చిత్రం నుంచి భీమ్లా నాయక్ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఏపీ సర్కారు టాలీవుడ్ ను, పవన్ ను టార్గెట్ చేసిందన్న విషయం అర్థమవుతోందని తెలిపారు. 

అయితే, పవన్ పై పగతో ఇలా చేస్తున్నా, సినీ పెద్దలు స్పందించకపోవడం బాధాకరమని నాగబాబు పేర్కొన్నారు. ఇది తప్పు అని ఎవరూ ఖండించలేకపోతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్ర కథానాయకుల పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

కానీ ప్రజలేమీ శాశ్వత అధికారం ఇవ్వలేదన్న విషయాన్ని వైసీపీ గ్రహించాలని, వారు అధికారంలో ఉండేది ఐదేళ్లేనని నాగబాబు స్పష్టం చేశారు. తమకు కష్టం వచ్చినప్పుడు సినీ పరిశ్రమ ముందుకు రాలేదని, అయినప్పటికీ సినీ పరిశ్రమలోని వారికి ఏ కష్టం వచ్చినా తాము ముందుకు వస్తామని, తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.


More Telugu News