24 ఏళ్ల తర్వాత పాక్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు.. కట్టుదిట్టమైన భద్రత

  • 4,000 మంది పోలీసులు, సైనికులతో ఏర్పాట్లు
  • ఇస్లామాబాద్ లో హోటల్ నుంచి రావల్పిండి స్టేడియం వరకు
  • ప్రయాణ మార్గం పూర్తిగా మూసివేత
  • విదేశీ ప్రధానులకు కల్పించేంత రక్షణ
సుదీర్ఘకాలం తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆరు వారాల పర్యటన కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆదివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు చేరుకుంది. విమానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఫొటోను స్టీవ్ స్మిత్ ట్విట్టర్ లో పంచుకున్నారు. 

2009లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. నాటి నుంచి విదేశీ జట్లను ఆకర్షించేందుకు పాకిస్థాన్ నానా పాట్లు పడుతోంది. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు ధైర్యం చేసి పాకిస్థాన్ కు వచ్చినా ఫలితం లేకపోయింది. లాహోర్ చర్చి వద్ద ఆత్మాహుతి దాడి చోటు చేసుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు వెనక్కి వెళ్లిపోయింది. చివరిగా 1998లో పాకిస్థాన్ గడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లు ఆడింది. 

కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అంతర్జాతీయ క్రికెట్ అథారిటీకి పాకిస్థాన్ గతేడాది అభయం ఇవ్వడంతో.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనకు ప్రణాళికలు వేసుకున్నాయి. భద్రతా కారణాలు చూపిస్తూ గతేడాది ఆఖరి నిమిషంలో న్యూజిలాండ్ జట్టు వెనక్కితగ్గింది. ఇంగ్లండ్ సైతం పాక్ పర్యటనలను వాయిదా వేసుకుంది. 

ఈ పరిణామాలతో పాకిస్థాన్ ప్రభుత్వం ఆస్ట్రేలియా జట్టుకు కనీవినీ ఎరుగని భద్రత కల్పించింది. 4,000 మంది పోలీసులు, సైనికులతో ఇస్లామాబాద్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేసే హోటల్, రావల్పిండి లోని క్రికెట్ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ స్థాయి భద్రత అత్యున్నత స్థాయి విదేశీ నేతలకే (అధ్యక్షుడు, ప్రధాని తదితర) కల్పించడం జరుగుతుందని పాకిస్థాన్ హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. 

హోటల్ నుంచి స్టేడియం వరకు ఉన్న 15 కిలోమీటర్ల మార్గాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు పర్యటించే సమయంలో పూర్తిగా బ్లాక్ చేయనున్నారు. దారి పొడవునా స్నిపర్స్ ను నియమించారు. మార్చి 4న ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్ లు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ తర్వాత ఏప్రిల్ 6న ఆస్ట్రేలియా జట్టు పాక్ ను వీడనుంది.


More Telugu News