ఫిబ్రవరి మాసంలో తగ్గిన రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు

  • ఈ ఫిబ్రవరిలో 59 వేలు బైకులు విక్రయించిన సంస్థ
  • గతేడాది ఫిబ్రవరిలో 69 వేల బైకుల అమ్మకం
  • సెమీకండక్టర్ చిప్ ల కొరత
  • ఉత్పత్తి తగ్గిందన్న రాయల్ ఎన్ ఫీల్డ్
ద్విచక్రవాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ ఫిబ్రవరి మాసంలో బైక్ ల అమ్మకాల్లో తగ్గుదల నమోదు చేసింది. ఫిబ్రవరిలో 59,160 మోటార్ సైకిళ్లను మాత్రమే దేశీయ మార్కెట్లో విక్రయించింది. 2021 ఫిబ్రవరితో పోల్చితే ఇది 15 శాతం తక్కువ. గతేడాది ఫిబ్రవరిలో రాయల్ ఎన్ ఫీల్డ్ 69,659 బైకులు విక్రయించింది. 

సెమీకండక్టర్ చిప్స్ లభ్యత తక్కువగా ఉన్న కారణంగా, సప్లై-డిమాండ్ గొలుసు పరిమితులు నెలమొత్తం కొనసాగాయని, తద్వారా ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. అమ్మకాల తగ్గుదలకు కారణం ఇదేనని రాయల్ ఎన్ ఫీల్డ్ ఓ ప్రకటనలో వివరించింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించింది. 

కాగా, ఎగుమతుల విషయంలో రాయల్ ఎన్ ఫీల్డ్ కు ఫిబ్రవరి మాసం ఊరట కలిగించిందనే చెప్పాలి. ఈ ఫిబ్రవరిలో ఎగుమతుల విషయంలో 55 శాతం వృద్ధి కనబరిచింది. 7,025 బైకులను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. 

కరోనా సంక్షోభంతో వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో సెమీకండక్టర్ తయారీ రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. దాంతో, ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీ రంగంలో స్తబ్ధత నెలకొంది.


More Telugu News