సాంకేతిక యుగంలోనూ ప్రాచీన కొల‌మానాలేనా?.. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ కొత్త వాద‌న‌

  • గ్రూప్ 1 అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితి కావాల్సిందే
  • డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తు 165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గించాలి
  • ఐపీఎస్ అభ్య‌ర్థుల ఎత్తు 165 సెంటీ మీట‌ర్లే క‌దా
  • బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ వాదన 
తెలంగాణ‌లో కొలువుల జాత‌ర‌కు కేసీఆర్ స‌ర్కారు తెర తీసింది. మూడు రోజుల క్రితం అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌మ అర్హ‌త‌ల మేర‌కు ద‌క్కే ఉద్యోగాల కోసం అభ్య‌ర్థులు అప్పుడే ప్రిప‌రేష‌న్ కూడా మొద‌లెట్టేశారు. ఇలాంటి స‌మ‌యంలో ప‌లు రాజ‌కీయ పార్టీల నుంచి స‌రికొత్త డిమాండ్లు వినిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజ‌కీయ‌వేత్త‌గా మారిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇప్పుడు ఓ కొంగొత్త డిమాండ్‌ను తెర ముందుకు తీసుకువ‌చ్చారు.

ఆధునిక సాంకేతిక యుగంలోనూ ప్రాచీన‌కాలం నాటి కొల‌మానాలేనా? అంటూ ఆయ‌న సంధించిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాల‌కు ప్ర‌భుత్వం కొన‌సాగిస్తూ వ‌స్తున్న 167.7 సెంటీ మీట‌ర్ల ఎత్తు నిబంధ‌న‌ను ఇంకా కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. యూపీఎస్పీ ద్వారా భ‌ర్తీ అవుతున్న ఐపీఎస్ కొలువుల‌కు కూడా 165 సెంటీ మీట‌ర్ల ఎత్తునే నిబంధ‌న‌గా కొన‌సాగిస్తున్న విష‌యాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. అంతేకాకుండా ఆధునిక యుగంలో.. సాంకేతిక ప‌రిజ్ఞానం ప‌రిఢ‌విల్లుతుతున్న ఈ కాలంలోనూ ఇంకా ప్రాచీన కొల‌మానాలేనా అంటూ ఆయ‌న త‌న‌దైన శైలి వ్యాఖ్య చేశారు. 

రాష్ట్రంలో 11 ఏళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి.. అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితిని 3 నుంచి 5 ఏళ్ల దాకా పెంచాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. ఓ ఐపీఎస్ అధికారిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆరేళ్ల స‌ర్వీసు ఉండ‌గానే.. బ‌డుగుల ఉద్ధర‌ణ కోసం వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకుని రాజ‌కీయాల్లోకి దిగిన ప్ర‌వీణ్ కుమార్ నుంచి వ‌చ్చిన ఈ కొత్త డిమాండ్ ప‌ట్ల కేసీఆర్ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.


More Telugu News