చెక్కలతో ట్రెడ్ మిల్... "వావ్" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేటీఆర్

  • వ్యాయామానికి విశేషంగా తోడ్పడే ట్రెడ్ మిల్
  • నడక, జాగింగ్, రన్నింగ్ లకు ఉపయుక్తం
  • చెక్కలతో ట్రెడ్ మిల్ ను రూపొందించిన తెలంగాణ వ్యక్తి
  • అతడికి సాయం అందించాలని 'టి వర్క్స్' కు సూచన
రోజువారీ వ్యాయామాలకు ఉపయోగించే ట్రెడ్ మిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటివద్దనే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసే వెసులుబాటును ట్రెడ్ మిల్ అందిస్తుంది. ఈ ట్రెడ్ మిల్ లో మోటార్, కన్వేయర్ బెల్టు, ప్లాట్ ఫాం, డిజిటల్ కన్సోల్ వంటి భాగాలుంటాయి. ఇవి నడిచేందుకు పవర్ అవసరం. వీటి ధరలు రూ.15 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటాయి. 

అయితే, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్ మిల్ రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. ఈ వుడెన్ ట్రెడ్ మిల్ అచ్చం యాంత్రిక ట్రెడ్ మిల్ లానే పనిచేస్తుండడం విశేషం. పైగా ఇది నడిచేందుకు ఎలాంటి పవర్ అవసరంలేదు. 

ఈ వీడియోను చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అచ్చెరువొందారు. "వావ్" అంటూ ట్విట్టర్ లో తన స్పందన వెలిబుచ్చారు. ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ నూతన ఆవిష్కరణల ప్రోత్సాహక విభాగం టి వర్క్స్ కు సూచించారు. చెక్కలతో ట్రెడ్ మిల్ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని తెలిపారు.


More Telugu News