మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వాడుతున్నారా... వెంటనే అప్ డేట్ చేసుకోకపోతే ప్రమాదం: కేంద్రం హెచ్చరిక

  • పాత వెర్షన్లకు ముప్పు పొంచి ఉందన్న కేంద్రం
  • సీఈఆర్టీ బగ్స్ ను గుర్తించిందని వెల్లడి
  • కీలక డేటా హ్యాకర్ల పరమవుతుందని వివరణ
ఇంటర్నెట్ వినియోగించేవారిలో చాలామంది మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ను వినియోగిస్తుంటారు. అయితే, ఫైర్ ఫాక్స్ 98, ఫైర్ ఫాక్స్ ఎస్సార్ 91.7, థండర్ బర్డ్ వెర్షన్లకు ముందు వెర్షన్లను కలిగివున్న వారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. తమ బ్రౌజర్ ను ఫైర్ ఫాక్స్ 98, ఎస్సార్ 91.7, థండర్ బర్డ్ 91.7 వెర్షన్లకు అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. 

ఫైర్ ఫాక్స్ పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు (బగ్స్) ఉన్నట్టు సీఈఆర్టీ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ బగ్స్ బ్రౌజర్ భద్రతా వ్యవస్థలను సైతం ఛేదిస్తాయని, యూజర్లకు చెందిన కీలక సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తాయని వివరించింది. యూజర్లకు నకిలీ లింకులు పంపుతాయని, వాటిపై క్లిక్ చేస్తే బ్రౌజర్ లో తిష్టవేసి కీలక డేటాను దొంగిలిస్తాయని పేర్కొంది. 

బ్రౌజర్ ఓపెన్ చేసి హెల్ప్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అబౌట్ ఫైర్ ఫాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందని వెల్లడించింది. దానిపై క్లిక్ చేస్తే మెనూలో కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటే, అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News