ఉక్రెయిన్ లో హింసకు రష్యా వెంటనే ముగింపు పలకాలి: భారత్, జపాన్ ప్రధానుల సంయుక్త ప్రకటన

  • భారత్ లో జపాన్ ప్రధాని పర్యటన
  • ప్రధాని మోదీతో సమావేశం
  • రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై సమాలోచనలు
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత్ లో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిరువురి చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.  ఉక్రెయిన్ పై రష్యా దాడులను వెంటనే నిలిపివేయాలని మోదీ, కిషిదా ఓ సంయుక్త ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లో హింసకు రష్యా తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. 

ఉక్రెయిన్ పై రష్యా సేనల దాడులు అంతర్జాతీయ కట్టుబాట్ల మూలాలను కుదిపేశాయని జపాన్ ప్రధాని కిషిద వ్యాఖ్యానించారు. ఏకపక్ష చర్యలతో పరిస్థితులను బలవంతంగా మార్చాలనుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని విభేదాలను అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కిషిద పిలుపునిచ్చారు. 

ఈ తరుణంలో కొత్త ప్రపంచ క్రమం కోసం కృషి చేయాల్సి ఉందని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించాలని తెలిపారు. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చాల్సి ఉందని పేర్కొన్నారు.


More Telugu News