లోక్ సభలో.. విశాఖ ఉక్కు కోసం క‌లిసి గళమెత్తిన టీడీపీ, వైసీపీ ఎంపీలు!

  • విశాఖ ఉక్కుపై గ‌ళ‌మెత్తిన‌ కింజ‌రాపు, కేశినేని, మార్గాని
  • క్యాప్టివ్ మైన్స్ కేటాయించాల‌న్న ఏపీ ఎంపీలు
  • కొట్టిపారేసిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి
పార్ల‌మెంటులో ఏపీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి బుధ‌వారం ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేట్ ప‌రం కాకుండా వేర్వేరుగానే పోరాడుతున్న అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీలు బుధ‌వారం నాటి లోక్ స‌భ స‌మావేశాల్లో ఒకే స‌మ‌యంలో ఈ అంశాన్ని లేవ‌నెత్తి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాలంటూ టీడీపీ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు లోక్ స‌భ‌లో ప్ర‌స్తావించ‌గా.. అదే పార్టీకి చెందిన మ‌రో ఎంపీ కేశినేని నాని కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. వీరిద్ద‌రికీ మ‌రింత ద‌న్ను ఇచ్చేలా వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ కూడా విశాఖ ఉక్కుపై గ‌ళ‌మెత్తారు.

విశాఖ ఉక్కు ప‌రిశ్రమ న‌ష్టాల్లో న‌డుస్తున్న సంస్థ ఎంత‌మాత్రం కాద‌ని చెప్పిన రామ్మోహ‌న్ నాయుడు.. క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయిస్తే మ‌రింత మేర లాభాలు ఆర్జించే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ స‌రైన నిర్ణ‌యం కాద‌ని చెప్పిన ఆయ‌న‌... దీనిపై కేంద్రం పున‌రాలోచ‌న చేయాల‌ని కోరారు.

 ఆ వెంట‌నే అందుకున్న కేశినేని నాని ఉద్య‌మం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ ప‌రం చేయ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వ రంగంలోని సెయిల్‌ను కాద‌ని విశాఖ ఉక్కును మాత్ర‌మే ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డం స‌బ‌బు కాద‌ని కూడా నాని పేర్కొన్నారు.

ఆ వెంట‌నే వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ అందుకున్నారు. రామ్మోహ‌న్ నాయుడు వాద‌న‌నే మార్గాని వినిపించిన‌ప్ప‌టికీ ఈ నిర్ణ‌యంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పున‌రాలోచ‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయించాల‌ని ఎప్ప‌టినుంచో కోరుతున్నామ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

రాజ‌కీయాల‌ను వ‌దిలేసి ఇలా రెండు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన ఎంపీలు గ‌ళం ఎత్తినా.. కేంద్రం మాత్రం కనిక‌రించ‌లేదు. క్యాప్టివ్ మైన్స్ లేన‌ప్ప‌టికీ విశాఖ ఉక్కు గ‌తంలో లాభాల‌ను ఆర్జించింద‌న్న కేంద్ర మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ సింగ్‌.. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీక‌ర‌ణే ఉత్త‌మ నిర్ణ‌య‌మ‌ని వెల్ల‌డించారు.


More Telugu News