టీడీపీతోనే బ‌డుగుల‌కు అస‌లైన స్వాతంత్య్రం: నారా లోకేశ్

  • టీడీపీ 40 వ‌సంతాల వేడుక‌లో నారా లోకేశ్ ప్ర‌సంగం
  • టీడీపీ సాధించిన ఘ‌న‌త‌ల‌ను వ‌ల్లె వేసిన లోకేశ్
  • సామాన్యుల‌ను నాయ‌కుల‌ను చేసింది టీడీపీనేన‌ని వ్యాఖ్య‌
  • తెలుగు వారి ఆత్మ గౌర‌వం టీడీపీనేన‌న్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 40 వసంతాల వేడుక సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పార్టీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైన వేడుక‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నాయి. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో ప్రారంభ‌మైన వేడుక‌ల‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త వ‌హిస్తుండ‌గా.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌రుగుతున్న వేడుక‌ల‌కు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ నేతృత్వం వ‌హిస్తున్నారు.

వేడుక‌ల్లో భాగంగా మంగ‌ళ‌గిరి నుంచి పార్టీ కార్యాల‌యం వ‌ర‌కు భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వ‌హించిన నారా లోకేశ్.. పార్టీ కార్యాల‌యంలో ప్రారంభ‌మైన వేడుక‌ల్లో కీల‌కోప‌న్యాసం చేశారు. పార్టీ ప్ర‌స్థానాన్ని ప్ర‌స్తావిస్తూనే... పార్టీ సాధించిన ఘ‌న‌త‌ల‌ను ఆయ‌న సుస్ప‌ష్టంగా వివ‌రించారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లు అని ముందుకు సాగితే.. ప్ర‌స్తుత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేద‌రిక నిర్మూలన ల‌క్ష్యంగా సాగుతున్నార‌ని లోకేశ్ చెప్పారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వం తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్న ఆయ‌న‌... సామాన్యుల‌ను నాయ‌కుల‌ను చేసింది టీడీపీనేన‌ని తెలిపారు.

టీడీపీ ఆవిర్భావంతో బడుగుల‌కు 1982లోనే అస‌లైన స్వాతంత్య్రం వ‌చ్చిందని చెప్పిన లోకేశ్.. జ‌నాభాలో స‌గం ఉన్న బీసీల‌కు టీడీపీ అధికారం ఇచ్చిందన్నారు. బీసీల‌ను చ‌ట్ట‌స‌భ‌ల్లో కూర్చోబెట్టిన పార్టీ కూడా టీడీపీనేన‌న్నారు. దేశంలో సంక్షేమం అంటే ఏమిటో చూపింది ఎన్టీఆరేన‌ని చెప్పారు. పేద‌ల‌కు తొలిసారి పింఛ‌న్లు అందించింది టీడీపీనేన‌ని చెప్పిన లోకేశ్.. తొలిసారి జ‌న‌తా వస్త్రాల‌ను చౌక‌గా ఇచ్చింది కూడా టీడీపీనేన‌ని గుర్తు చేశారు.


More Telugu News