వీసాల అక్రమాల కేసులో కార్తీ చిదంబరం సన్నిహితుడి అరెస్ట్

  • ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన సీబీఐ
  • పవర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చైనా జాతీయులకు వీసా
  • రూ.50 లక్షల లంచానికి 263 మందికి వీసాలు
వీసాల అక్రమాలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి నిన్న చిదంబరం, కార్తీల ఇళ్లతో పాటు పది చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. 

అదే కేసుకు సంబంధించి గత రాత్రి కార్తీ సన్నిహితుడు ఎస్. భాస్కర్ రామన్ ను అధికారులు విచారించి, ఇవాళ ఉదయం అతనిని అరెస్ట్ చేశారు. ఓ విద్యుత్ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి సంబంధించి 263 మంది చైనా జాతీయులకు రూ.50 లక్షలు లంచం తీసుకుని వీసాలు ఇచ్చారన్న ఆరోపణల మీద కార్తీపై సీబీఐ కేసును నమోదు చేసింది. ఆయన సన్నిహితుడైన భాస్కర రామన్ ద్వారానే ఈ లంచం తీసుకున్నట్టు పేర్కొంది.

కార్తీ తండ్రి చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న 11 ఏళ్ల క్రితం ఈ వ్యవహారం నడిచిందని అధికారులు తెలిపారు. 2011లో వేదాంత గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన టీఎస్పీఎల్ ప్రాజెక్టును అనుకున్న గడువులోగా పూర్తి చేసేందుకు గానూ చైనా వర్కర్లకు అక్రమ మార్గంలో వీసాలిప్పించినట్టు సీబీఐ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యమవుతున్న కారణంగా చట్టపరమైన చర్యలను తప్పించుకునేందుకు ప్రాజెక్ట్ ప్రతినిధి వికాస్ మఖారియా.. అదనపు సిబ్బందిని తెప్పించుకునేందుకు ఈ అక్రమానికి తెరదీసినట్టు చెప్పారు.


More Telugu News