బజాజ్ ఆటో సెంటిమెంట్.. అకుర్ధి నుంచే  చేతక్ ఈవీ తయారీ

  • పూణెలోని అకుర్ధిలో ప్రత్యేకంగా ప్లాంట్ నిర్మాణం
  • ప్రారంభించిన రాజీవ్ బజాజ్
  • 1970ల్లో అకుర్ధి ప్లాంట్ నుంచే చేతక్ తయారీ
బజాజ్ ఆటో సెంటిమెంట్ కు పెద్ద పీట వేసింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం పూణెలోని అకుర్ధిలో కొత్తగా ప్లాంట్ ను నిర్మించింది. దీన్ని సంస్థ చైర్మన్ రాజీవ్ బజాజ్ ప్రారంభించారు. దీంతో చేతక్ ఈవీ విక్రయాలు గణనీయంగా ఊపందుకోనున్నాయి. ఇప్పటి వరకు పరిమిత తయారీ సామర్థ్యమే కంపెనీకి ఉండేది. సంస్థ వ్యవస్థాపకుడైన రాహుల్ బజాజ్ జయంతి సందర్భంగా ప్లాంట్ ను ప్రారంభించడం గమనార్హం.

బజాజ్ ఆటో 1970ల్లో తన తొలి చేతక్ స్కూటర్ ను అకుర్ధిలోని ప్లాంట్ నుంచే తీసుకువచ్చింది. నాడు చేతక్ దేశవ్యాప్తంగా పెద్ద ట్రెండ్ నే సృష్టించింది. మూడు దశాబ్దాల పాటు మార్కెట్ ను ఏలింది. మారిన పరిస్థితులలో ఆ తర్వాతి కాలంలో చేతక్ ను బజాజ్ ఆటో పూర్తిగా నిలిపివేసి కేవలం మోటారు సైకిళ్ల తయారీపై దృష్టి సారించింది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తన పాప్యులర్ బ్రాండ్ చేతక్ ను ఎలక్ట్రిక్ స్కూటర్ గా 2019లో ప్రవేశపెట్టింది. 

ఇప్పటి వరకు సంస్థ 14,000 చేతక్ ఈవీలను విక్రయించగా, మరో 16వేల చేతక్ లకు బుకింగ్ లు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. డిమాండ్ కు తగ్గ సరఫరా కోసం బజాజ్ చేతక్ ఈవీల తయారీకి ప్రత్యేకంగా ప్లాంట్ ను సిద్ధం చేసింది. పెరిగే డిమాండ్ కు అనుగుణంగా ప్లాంట్ సామర్థ్యాన్ని వార్షికంగా 5 లక్షల చేతక్ ఈవీల తయారీకి విస్తరించొచ్చని కంపెనీ తెలిపింది.


More Telugu News