రూ.24 వేల కోట్లతో తెలంగాణలో డిస్ ప్లే తయారీ యూనిట్... చరిత్రాత్మకం అని అభివర్ణించిన కేటీఆర్

  • భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన రాజేష్ ఎక్స్ పోర్ట్స్
  • ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన కేటీఆర్
  • తెలంగాణకు హైటెక్ పరిశ్రమ వచ్చిందని వివరణ
  • ఇలాంటివి జపాన్, తైవాన్, కొరియాల్లోనే కనిపిస్తాయని వెల్లడి
ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్ పోర్ట్స్ సంస్థ (ఎలెస్ట్) భారీ పెట్టుబడులతో తెలంగాణలో డిస్ ప్లే తయారీ యూనిట్ స్థాపిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అత్యంత అధునాతన అమోలెడ్ (AMOLED) డిస్ ప్లే తయారీ యూనిట్ దేశంలో ఇదే మొదటిదని పేర్కొన్నారు. రూ.24 వేల కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 

దేశంలో హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇదొకటని పేర్కొన్నారు. తెలంగాణకు ఇది చరిత్రాత్మక దినం అని అభివర్ణించారు. హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచపటంలో నిలిపిన ఘనత తెలంగాణదేనని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి అత్యాధునిక పరిశ్రమలు సాధారణంగా జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాల్లో కనిపిస్తాయని, ఇప్పుడు తెలంగాణలోనూ ఏర్పాటవుతోందని వివరించారు. 

భాగస్వామ్య సంస్థలకు, అనుబంధ పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించే దిశగా ప్రపంచస్థాయి టీవీ, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ తయారీదారులకు అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుందని కేటీఆర్ వివరించారు.


More Telugu News